Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

ఓమ్‌
శ్రీ జగద్గురుభ్యో నమః
జగద్గురు బోధలు
ప్రపంచ భాషలపై సంస్కృత ప్రభావము

సంధ్యాసమయమున నటరాజు తాండవము చేస్తూ చేతిలోని ఉడుక వాయించగా వెలువడిన ధ్వనులను పాణిని అ ఇ ఉ ణాదులగు పదునాలుగు సూత్రాలుగా గ్రహించి వ్యాకరణ సూత్రాలు రచించాడు. పాణిని చెప్పిన వ్యాకరణానికి వరరుచి వార్తికమునూ పతంజలి భాష్యమునూ వ్రాశారు. పతంజలి వ్రాసిన భాష్య మొకదానికే మహాభాష్యమని పేరు. తర్కము, మీమాంస, అలంకారము మొదలగు అన్ని శాస్త్రములకున్నూ సూత్రాలున్నవి. భాష్యములున్నూ ఉన్నవి. ఇన్ని భాష్యములున్నా పతంజలి చెప్పిన భాష్యానికి మాత్రమే మహాభాష్యమని ప్రశస్తి.

దేశభాషలకు వ్యాకరణం లక్షణం. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాషకు వ్యవహారం. భాషపేరు దేశాన్ని అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు- మనదేశంలోనే హిందీభాషలో ఒక శాఖకు వ్రజభాష అని పేరు. అది ఏ చోట ప్రచారంలో ఉన్నదో ఆ దేశాన్ని అనుసరించి ఆ పేరు వాడుక అవడం చూస్తున్నాము. ఇతర భాషలను గమనించినా ఇది స్పష్టమవుతుంది. సంస్కృతము దేవభాష, కాని ఇంగ్లీషు చదువు కొన్నవారు ఈ మాట నమ్మరు. ఏదో ఒక కాలాన సంస్కృతభాష వాడుక భాషగా ఉండి ఉండాలని వారి నమ్మిక. ప్రస్తుత మీ భాష వాడుకలో లేదుగనుక వారు దీనిని మృతభాష అని అంటారు. కాని యిది సరికాదు. మన దేశంలో వాడుక భాషలుగా నున్నవి పాలి అర్ధ మాగధి మొదలినవేకాని సంస్కృతం మాత్రం కాదు. కాని భాష లన్నింటిలోనూ సంస్కృతం కలిసి ఉన్నది. దేవాంశము ఎట్లా అందరలోనూ కలిసి ఉన్నదో దేవతాభాషకూడా అట్లాగే అన్ని భాషలలోనూ కలిసి ఉన్నది.

సంస్కృత భాషయందలి భ్రాతా అను పదము ఇంగ్లీషున బ్రదర్‌ అని రూపాంతర మొందింది. అటులే 'మాతా - మదర్‌, పితా - ఫాదర్‌, స్వసా - సిస్టర్‌' అను పదములను రూపాంతరమందినవే. ఇటుల విదేశ భాషలందును స్వదేశ ప్రాంతీయభాషలందును సంస్కృతచ్ఛాయలు మన కగపడతవి. 'సప్తకోణము'లను పదము 'హెప్టగన్‌'గా మారుట ఇట్టిదే.

ఆంగ్లము రాజభాషగనుక మన మాంగ్లమభ్యసిస్తున్నాము. చచ్చి స్వర్గమునకు పోయిన మనకు దేవభాష తెలియకపోతే దేవతలతో మన మెట్లా సంభాషిస్తాం? అందుచేత మనం సంస్కృతం నేర్చే తీరాలి. కోర్టులో చక్కగా వాదించవలసి ఉంటే న్యాయవాదికి వ్యాకరణ శుద్ధమైన ఆంగ్లభాషాజ్ఞానం ఉండాలి. అట్లే సమస్తలోకాలకు అధిపతులయిన దేవతలతో మాటలాడవలెనంటే వ్యాకరణ శుద్ధాలయిన సుశబ్దాలనే పలకాలి. వ్యాకరణసూత్రాలు వార్తికాలూ భాష్యాలు ఇందు కోసమే ఏర్పడినవి.

దేవతలతో సంబంధం కల బ్రాహ్మణాదులు సంస్కృత భాష అభ్యసించాలి. శూద్రులుకూడా దేవకార్యములందూ పితృ కార్యములందూ నమః తర్పయామి అనే సంస్కృతపదాలు చెప్పవలసి ఉన్నది కాబట్టి వారికిన్నీ సంస్కృతభాష రావాలి.

భక్తిమార్గావలంబకులు ఏ భాషలోనయినా స్తుతింపవచ్చును. కాని కర్మ మార్గావలంబకులు సంస్కృతము నభ్యసించియే తీరాలి. కర్మను అనుష్ఠింపవలసిన విధులను చెప్పే గ్రంథాలూ మంత్రాలూ సంస్కృతభాషయందే ఉన్నవి.

చాలా నాళ్ళముందు సౌరమాన ప్రకారం చిత్రి నెల సరియయిన మాసం. పాశ్చాత్య దేశాలలోనూ సంవత్సరాదిగా ఉండి ఉండాలని అనడానికి కొన్ని ఆధారాలున్నవి. సప్త అష్ట నవ దశ అనే శబ్దాలు సెప్టెంబర్‌ అక్టోబర్‌ నవంబర్‌ డిశంబర్‌ అనే పదాలతో పలుకబడ్డవి. మార్చిమాసం మొదటి నెలగా ఉంటేనే యీ క్రమం సరిగా ఉంటుంది. దానిచే మార్చినెల మొదటినెలగా ఉండవలెనని ఊహించడానికి అవకాశం ఉన్నది. కాని ప్రస్తుతం విదేశీయులకు జనవరి మొదటినెల. అది మార్గళి నెల నడుమ వస్తుంది (మార్గళ్సిమార్గశిరం) మార్గళిమాసానికి సంస్కృతభాషలో 'ఆగ్రహాయణికః' అని ఒక పేరు. ఈ పేరుకు ఉగాది అని అర్ధం. అగ్ర మనగా మొదలు హాయన మనగా సంవత్సరం. తెనుగువారిది చాంద్రమానం.

ప్రపంచంలో అన్ని భాషలందున్నూ సంస్కృతం కలిసి ఉన్నదని చెప్పడానికే పై వివరణం అంతా. ఏ కాలంలోగాని ఏ దేశంలోగాని సంస్కృతం వాడుక భాషగా ఉన్నట్లు కనిపించదు.

రామభద్ర దీక్షితులు అనే మహనీయులొకరున్నారు. వారు పరమ రసికులు. వారు 'పతంజలి చరితం' అనే కావ్యం వ్రాశారు. ఆ కావ్యంలో నటరాజు మహావిష్ణువు హృదయములో నాట్యం చేసినట్లు ఉన్నది.

తిరువారూరు-ఆలయంలో వైష్ణవ చిహ్నాలంనేకం కనిపించడమువల్ల మొదట అది విష్ణ్వాలయంగా ఉండి ఉండాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. శైవాధిక్యం కల సమయంలో దానిని శివాలయముగా మార్చివేశా రనిన్నీ అలాగే 'నాచ్చియారు' కోవెల మొదట శివాలయంగా ఉండి వైష్ణవాధిక్యం ఏర్పడిన కాలంలో విష్ణ్వాలయంగా మార్చి వేశారనిన్నీ చెపుతారు. అది నిజం కాదు. మొదటినుంచీ ఇవి ఈలాగే ఉన్నవి. తిరువారూరు కోవెల విష్ణు రూపంగానే కట్టబడ్డది. ఇక్కడ విష్ణువు హృదయ కమలంలో శివుడు నాట్యం చేస్తున్నట్లు ఒక మూర్తిని ప్రతిష్ఠించారు. విష్ణువునకు శయ్యపాము. కాని అది శివునకు ఆభరణం. ఒకప్పుడు విష్ణువు సాయంసమయాన శివుని ధ్యానించాడు. అపుడు శివస్వరూపమగు నటరాజు ఆయన హృదయకమలంలో ప్రసన్ను డయినాడు. విష్ణువు ఎంతో సంతోషించాడు. సంతోష భరితుడయిన విష్ణువు ఆదిశేషునకు భారమయాడు. 'నేను ప్రతినాడూ మిమ్ములను మోస్తూవస్తున్నాను. ఈ నాఁడు మీ రెందుకో ఇంత బరువైపోయారు, దీనికి కారణమేమి'టని ఆదిశేషుడు విష్ణువును అడిగాడు. అపుడు విష్ణువు 'ఆహాఁ ఈ నాడు నా హృదయకమలంలో శివుడు నృత్యం చేశాడు. దానివల్ల నేను బరువెక్కి ఉంటా'నని ఆయన బదులు చెప్పాడట.

శివనర్తనం అనేక విధాలు. వానిని తాండవం హంసనటనం, అజపానటనం అని అంటారు. తిరువారూరులోని శివుని నాట్యం, అజపా నాట్యం అని ప్రతీతి. ఈ చోట విష్ణువు సతతమూ అజపాజపం చేస్తూఉన్నాడు. జప మంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మంత్రాక్షరాలుగా చెప్పడం. అజప మనగా పెదవి కదలింపకుండా మనసులోనే జపించడం.

ఆ విష్ణుమూర్తి శయ్య యయిన ఆదిశేషుడే వ్యాకరణానికి భాష్యం వ్రాసిన పంతజలి. తాను వ్రాసిన భాష్యం ప్రవచించడానికి పతంజలి వేయిమంది శిష్యులను పోగు చేశాడు. శిష్యులను తనముందు కూచోబెట్టుకున్నాడు. వేయిమంది అడుగూతూ వచ్చే ప్రశ్నలకు తామసం లేకుండా బదులు చెప్పడానికి వీలుగా సహస్ర శీరాలతో ఆదిశేషుని వేషం ధరించాడు. తన రూపంలో కనబడే క్రౌర్యానికి భయపడకుండా ఉండటానికి తన విషాగ్నికి భస్మం కాకుండా ఉండటానికి వీలుగా తనకూ శిష్యులకూ నడుమ ఒక తెర కట్టించాడు. ఈ విషయమే యీ దిగువ శ్లోకం చెబుతుంది.

దృష్టిఘ్రాణవిషాన్‌ ఫణాధరపతీ నష్టాపి దృష్ట్వా స్వయం

రోద్ధుం చ్యావయితుం ప్రమాపయితు మ ప్యవ్యాహత పక్రమః |

మార్జారా న్నకులాంశ్చ కిం ఖగపతిః సాహాయ్యకే2సేక్షతే

కిం ప్రత్యర్థి కులస్య సత్త్వద ఇతి ప్రద్వేష్టి వా మారుతమ్‌||

చూచి విషం ప్రసరింప జేసేవి, ఆఘ్రాణించి విషవేగం చూపేవి ఇట్లాగా ఎనిమిది రకాలైన పాములున్నై. వానిని ఎదిరించి చంపగల గరుత్మంతుడు ప్రకృతి చేతనే పాములయెడల శాశ్వతిక విరోధం కల పిల్లుల సాయమూ ముంగిసల సాయమూ అపేక్షిస్తాడా? ఇంతేకాదు, ఆ పాములకు ప్రాణం పోసే గాలికి జడుస్తాడా?

శ్రీమన్నారాయణుని హృదయకమలంలో శివుడు నాట్యం చేయడం నారాయణోపనిషన్మంత్రాలు సూచిస్తివి. ఆ మంత్రాలలో 'సహస్ర శీరం దేవం' అనే మంత్రం నారాయణుని విరాట్‌ స్వరూపంగా చెప్పి ఆయన హృదయంలోని దహరాకాశంలో శివోపాసన చెప్పింది.

''పద్మకోశప్రతీకాశం హృదయం చా ప్యధోముఖం

తస్యాంతే సుషిరం సూక్ష్మం తస్యా శ్శిఖాయా మధ్యే

పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ న శివః స హరిః

స్సేంద్ర స్సోక్షరః పరమః స్వరాట్‌''

ఆ యీ మంత్రాలు పై చెప్పిన విషయాన్ని స్పష్టం చేస్తున్నవి.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page